అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం:(స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూమిపై అక్రమ ఆక్రమణల అంశంపై ఎండోమెంట్స్ శాఖ చర్యలకు సిద్ధమైంది. సర్వే నంబర్ 31లో ఉన్న 82 సెంట్ల దేవాదాయ భూమిని కొందరు ఆక్రమించారనే ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు.
ఈ సందర్భంగా ఎండోమెంట్స్ ఇన్‌స్పెక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ, సంబంధిత భూమికి ఇప్పటికే సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఆక్రమణలకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని, వారి ఆదేశాలు అందిన వెంటనే ఆక్రమణలను తొలగించే చర్యలు చేపడతామని వెల్లడించారు.
దేవాదాయ శాఖకు చెందిన భూమిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సంబంధిత స్థలం దేవాదాయ శాఖ ఆస్తి అని ప్రజలకు తెలియజేసేందుకు అక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేవాదాయ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, భవిష్యత్తులో ఇటువంటి ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఉమాదేవి స్పష్టం చేశారు. దీంతో బలిఘట్టం దేవాదాయ భూముల ఆక్రమణ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.