నర్సీపట్నం గ్రేడ్-1 మున్సిపాలిటీగా అభివృద్ధి పథంలో ముందుకు

నర్సీపట్నం, జూలై 18:( స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడింది. నర్సీపట్నం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో లింగాపురం బ్రిడ్జి సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద రూ.3.05 కోట్ల వ్యయంతో నిర్మించిన తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడ నుంచి వర్చువల్ విధానంలో ప్లాంట్‌ను ప్రారంభించగా, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి స్థానికంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, నర్సీపట్నం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్-1గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలోని 28 వార్డులు డంపింగ్ యార్డులుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక చొరవతో చెత్త నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. జిందాల్ కంపెనీకి వ్యర్థాల ప్రాసెసింగ్ బాధ్యతలు అప్పగించడంతో పాటు, వీఎంఆర్డీఏ నుంచి రూ.4.11 కోట్లు, స్వచ్ఛ ఆంధ్ర పథకం ద్వారా రూ.3.05 కోట్ల నిధులు మంజూరు చేయించామని చెప్పారు. గత రెండేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.32 కోట్లు ఖర్చు చేసి, చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు, పుష్‌కార్ట్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.
డంపింగ్ యార్డ్ వద్ద రిటైనింగ్ వాల్ లేకపోవడంతో వర్షాకాలంలో ఉత్తరవాహిని నది కలుషితమవుతోందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విజయకృష్ణన్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నర్సీపట్నం గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఎదగడం ప్రజలందరికీ గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ సూర్యచంద్ర, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, ఆర్డీవో వి.వి. రమణ, తహశీల్దార్ రామారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.