వేములపూడిలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు విత్తన గుళికలు, జీవామృతం, బయోచార్ వినియోగంతో మెరుగైన దిగుబడులు సాధించండి

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం (స్పీడ్ న్యూస్)
"ప్రకృతి వ్యవసాయం చేయండి.. మీ ఆరోగ్యాన్ని, కుటుంబ భవిష్యత్తును కాపాడుకోండి" అని అనకాపల్లి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) లచ్చన్న రైతులకు పిలుపునిచ్చారు.
నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో రైతులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు సకాలంలో కురిసే పరిస్థితి లేకపోవడంతో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా డ్రై సీడింగ్ పద్ధతిలో వరి విత్తనాలతో పాటు పెసర, మినుములు, బెండ తదితర పంటల విత్తనాలను గుళికల రూపంలో తయారు చేసి పొలాల్లో చల్లాలని సూచించారు. ఈ విధంగా తయారుచేసిన విత్తన గుళికలు ఆరు నెలల వరకు భూమిలో పాడవకుండా నిల్వ ఉండటంతో పాటు చీమలు, చెదలు, పక్షుల వల్ల నష్టం జరగకుండా కాపాడతాయని వివరించారు.
రసాయన ఎరువులు, పురుగుమందులకు బదులుగా ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వివిధ కషాయాలు, గ్రోత్ ప్రమోటర్లు వంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని సూచించారు. ఇవన్నీ బయో రిసోర్స్ సెంటర్లలో రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అలాగే బయోచార్‌ను తయారు చేసి భూమిలో వినియోగించడం ద్వారా నేల సారం పెరిగి, పోషకాలు స్థిరపడటంతో పంటల దిగుబడి మెరుగుపడుతుందని లచ్చన్న వివరించారు.
ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే జీవితంలో ఆనందం ఉండదని పేర్కొన్న ఆయన, ప్రతి రైతు తన పొలంలో కనీసం కొంతభాగంలోనైనా రసాయనాలు, పురుగుమందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఆహార పంటలు పండించి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జిలు చిన్నా, హారిక, మండల ఇన్‌చార్జి రమ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.