అనకాపల్లి జిల్లా, నాతవరం: రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో పర్యటించిన ఎంపీ చింతకాయల విజయ్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలమాలలు వేసి, నినాదాలతో విజయ్‌కు ఆత్మీయ స్వాగతం అందించారు.
పర్యటన ప్రారంభానికి ముందు నర్సీపట్నంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం, మరిడి మాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్, అనంతరం నాతవరం చేరుకున్నారు. అక్కడ సైకిల్ తొక్కుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తర్వాత నాతవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతూ, "అయ్యన్నపాత్రుడికి కొడుకుగా పుట్టడం వల్లే మీ అందరికీ సేవ చేసే అదృష్టం నాకు దక్కింది" అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, సహకారంతోనే తాను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యానని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబాన్ని రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. అయితే ప్రజల ఆశీర్వాదం, పార్టీ కార్యకర్తల అండతో ఆ కష్టాలను అధిగమించామని చెప్పారు.
మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మహిళలు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి, వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మంచి పాలన అందిస్తోందని పేర్కొన్నారు.
మహిళల సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, శ్రీ శక్తి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వారి అభివృద్ధికి మరింత ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు.
"నా తమ్ముడు చింతకాయల రాజేష్‌తో కలిసి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవ చేస్తాం. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు పేరుకు మచ్చ వచ్చే పని మేమెప్పుడూ చేయం" అని విజయ్ స్పష్టం చేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి గత రెండేళ్లలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుమారు రూ.532 కోట్ల అభివృద్ధి పనులను తీసుకువచ్చారని విజయ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను ఎంపీ చింతకాయల విజయ్ పంపిణీ చేసి, మహిళా స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.