వినాయక స్వామి, మరిడితల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధికి ప్రార్థనలు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో పర్యటన ప్రారంభం

నర్సీపట్నం, జూలై 16: (స్పీడ్ న్యూస్) రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పర్యటించారు. పర్యటన ప్రారంభానికి ముందు నర్సీపట్నం పట్టణంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం, శ్రీ మరిడితల్లి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నర్సీపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని దేవతలను ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎంపీకి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతకాయల విజయ్ నాతవరం మండల పర్యటనను ప్రారంభించారు. పర్యటన సందర్భంగా పలుచోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చింతకాయల విజయ్‌కు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనతో నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.