విశాఖపట్నం, జూలై 14: ( స్పీడ్ న్యూస్ )
విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం శాసనసభ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ చైర్మన్ హోదాలో 12 మంది సభ్యులతో కలిసి మంగళవారం విశాఖ జూను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శించే విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ వెల్లడించారు. విశాఖ జూ సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో 1,400కు పైగా జంతువులు, పక్షులు ఉన్నప్పటికీ వాటి సంరక్షణకు కేవలం ఒక వెటర్నరీ డాక్టర్, ఒక హెల్పర్ మాత్రమే ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి జంతువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
రోజుకు మూడు నుంచి నాలుగు వేల మంది సందర్శకులు జూను సందర్శిస్తున్నప్పటికీ, తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటీన్ వంటి కనీస సౌకర్యాలు సరిపడా లేకపోవడాన్ని కమిటీ గుర్తించిందన్నారు. సందర్శకులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు పిల్లల కోసం టాయ్ ట్రైన్, సాయంత్రం ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
జూ నిర్వహణకు ఏటా దాదాపు రూ.10 కోట్ల వ్యయం అవసరమవుతుండగా ప్రస్తుతం రూ.7.5 నుంచి రూ.8 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తోందని స్పీకర్ వివరించారు. ఈ ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పరిశ్రమల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద రూ.3 నుంచి రూ.4 కోట్లు సమీకరించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. అదేవిధంగా స్థానిక ఎంపీలు, రాజ్యసభ సభ్యుల నిధులు, జాతీయ బ్యాంకుల సహకారాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం సింగపూర్ నిపుణులతో చర్చలు జరుపుతూ కైలాసగిరితో అనుసంధానంగా విశాఖ జూను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందిస్తోందని స్పీకర్ వెల్లడించారు. అధికారుల సూచనలు, మీడియా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించి, విశాఖ జూను రాష్ట్రంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.