అనకాపల్లి జిల్లా – నర్సీపట్నం(స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని జనసేన నాయకుడు అద్దేపల్లి గణేష్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని, ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎదురవుతున్న ఇబ్బందులు అంతకంటే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి సమాన అవకాశాలు ఉండాలని, కానీ జనసేన నాయకులు, కార్యకర్తలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని అన్నారు.
జనసేన నాయకుడు అప్పన్న ఎన్‌ఎస్‌జీ దొరబాబు ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొందరు కూటమి పెద్దలు ఆయనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అద్దేపల్లి గణేష్ ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న నాయకులను అడ్డుకునే ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజల మద్దతుతో జనసేన మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీని అవసరానికి ఉపయోగించుకుని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీని, కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన విమర్శించారు. జనసేన కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని, నియోజకవర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అన్యాయాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు జనసేనలోని అంతర్గత విభేదాలే ప్రధాన కారణమని అద్దేపల్లి గణేష్ అభిప్రాయపడ్డారు. ఈ విభేదాలను అధిగమించి పార్టీని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే నియోజకవర్గంలో జనసేన మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.