నర్సీపట్నం, జూలై 13: (స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబొడ్డేపల్లి అల్లూరి సెంటర్ సమీపంలో ప్రభుత్వ ఇరిగేషన్ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం సంయుక్తంగా పరిశీలించారు.
ఇరిగేషన్ శాఖ ఏఈ రామన్నపాత్రుడు, రెవెన్యూ శాఖ ఆర్‌ఐ నాయుడు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆక్రమణలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ రామన్నపాత్రుడు మాట్లాడుతూ, ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అది చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారు 24 గంటల్లోగా స్వచ్ఛందంగా అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు తొలగించని పక్షంలో ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులే కూల్చివేత చర్యలు చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ కాలువలను పరిరక్షించేందుకు ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఇకపై ప్రభుత్వ స్థలాలపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.