విశాఖపట్నం, జూలై 12:(స్పీడ్ న్యూస్)
భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ పాత్రికేయులు మాశర్మ రచించిన పుస్తక ఆవిష్కరణ సభ విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, విశాఖ ఎంపీ ఎం. భరత్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉదయగిరి నుంచి దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు ప్రయాణం యువతకు ఆదర్శమని కొనియాడారు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య నాయుడు పాత్రను గుర్తు చేసుకుంటూ, 1983లో ఎన్టీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో వెంకయ్య నాయుడు వంటి మహానేతల ప్రసంగాలు ఆసక్తిగా వినేవాడినని తెలిపారు.
వెంకయ్య నాయుడు ఎప్పుడూ నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మాట్లాడే నాయకుడని ప్రశంసించిన అయ్యన్నపాత్రుడు, ఆయన జీవితాన్ని ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.
ప్రస్తుత రాజకీయాలపై స్పందించిన ఆయన, ఉచితాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయకుండా విచక్షణారహితంగా ఉచితాలు ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. నిజంగా అవసరమైన పేదవారికే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలని, ప్రజలు కూడా ఓటు వేసే సమయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన స్పీకర్, యువ నాయకత్వం ద్వారానే కొత్త ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు సాధ్యమవుతాయని అన్నారు. సమాజం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానాన్ని తెలుసుకునేందుకు ఈ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు.