నర్సీపట్నం, జూలై 12:(స్పీడ్ న్యూస్)
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక చొరవతో ఊతం లభించింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిలిచిపోయిన 22 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.291.35 లక్షల నిధులు మంజూరైనట్లు స్పీకర్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సగం నిర్మాణం పూర్తై నిరుపయోగంగా మారిన హెల్త్ క్లినిక్ భవనాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి అవసరమైన నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు.
మంజూరైన నిధుల్లో నర్సీపట్నం మండలంలోని నాలుగు భవనాలకు రూ.47.45 లక్షలు, నాతవరం మండలంలోని ఏడు భవనాలకు రూ.88.30 లక్షలు, గొలుగొండ మండలంలోని ఆరు భవనాలకు రూ.81.50 లక్షలు, మాకవరపాలెం మండలంలోని ఐదు భవనాలకు రూ.74.10 లక్షలు కేటాయించినట్లు వివరించారు.
నిధులు మంజూరవడంతో వెంటనే పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నర్సీపట్నం పంచాయతీరాజ్ ఈఈ, డీఈలకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాల్లో నాణ్యతకు ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు కూడా పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
త్వరలోనే అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ స్పష్టం చేశారు.