నర్సీపట్నం, జూలై 11:
పెట్టుబడి పేరుతో తీసుకున్న రూ.22 లక్షలను తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు, డబ్బులు అడిగిన ప్రతిసారీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నర్సీపట్నంకు చెందిన జనసేన నాయకుడు ఎన్ఎస్‌జీ దొరబాబుపై బేరా కామాక్షి కల్పన శనివారం నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, తన భర్త బేరా శేషు 2011లో వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాలలో భాగస్వామిగా మొదట రూ.12 లక్షలు, అనంతరం మరో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారని, మొత్తం రూ.22 లక్షలు పెట్టుబడి అయినప్పటికీ ఆయన మరణానంతరం ఇప్పటివరకు ఆ డబ్బును తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. పలుమార్లు డబ్బు కోరినా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, అవమానకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, డబ్బులు మళ్లీ అడిగితే చంపేస్తామని, ఎక్కడికైనా వెళ్లి చెప్పుకున్నా తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ బెదిరింపుల కారణంగా తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో రాత్రి వేళ తనను బైక్‌తో ఢీకొట్టేందుకు ప్రయత్నించారని, అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు.
తనపై జరిగిన బెదిరింపులు, దాడి యత్నంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు రావలసిన రూ.22 లక్షల పెట్టుబడి మొత్తాన్ని ఇప్పించాలని, తమ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని డీఎస్పీని కామాక్షి కల్పన కోరారు.
గమనిక: పై వివరాలు ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల ఆధారంగా ఉన్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి స్పందన, పోలీసుల విచారణ ఫలితాలు వెలువడాల్సి ఉంది.