అనకాపల్లి, జూలై 10: (స్పీడ్ న్యూస్)
కార్యకర్తలు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేపట్టిన అంగన్వాడీ ఉద్యోగులు, నెహ్రూ చౌక్ నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి అధ్యక్షత వహించగా, రాష్ట్ర సీఐటీయూ అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులపై రోజురోజుకు పనిభారం పెంచుతూ, తగిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఇప్పటికే పోషణ ట్రాకర్, బాలసంజీవిని వంటి యాప్‌ల ద్వారా కేంద్రాల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు, ఆరోగ్య శాఖకు సంబంధించిన పీఎంఎంవీవై, స్క్రీనింగ్ తదితర ఆన్‌లైన్ పనులను కూడా బలవంతంగా అప్పగిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చేసే స్థాయి డిజిటల్ పనులను అతి తక్కువ వేతనాలతో అంగన్వాడీ ఉద్యోగుల చేత చేయించడం వల్ల ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లకు నెలకు రూ.11,500, హెల్పర్లు, మినీలకు రూ.7,000 మాత్రమే వేతనం అందుతోందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇది ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఉద్యోగులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, నవచేతన యాప్‌ను రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్, గ్రాట్యుటీపై స్పష్టమైన మార్గదర్శకాలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే హెల్పర్ల ప్రమోషన్లలో ఐదేళ్ల సీనియారిటీ నిబంధనను తొలగించాలని, పెండింగ్ టీఏ బిల్లులను వెంటనే చెల్లించాలని, బీఎల్ఓ విధుల నుంచి అంగన్వాడీ ఉద్యోగులను మినహాయించాలని కోరారు.
సభలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు, గౌరవ అధ్యక్షురాలు జి. కుమారి, కోశాధికారి వి.వి. రమణమ్మ, ప్రాజెక్టు, సెక్టార్ నాయకులు, సీఐటీయూ జిల్లా నాయకులు, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ నాయకులు హెచ్చరించారు.