నర్సీపట్నం, జూలై 10:( స్పీడ్ న్యూస్ ) బలిఘట్టం గోశాలలో గోవుల ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వెటర్నరీ స్టాండ్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గోవులకు అత్యవసర వైద్య సేవలు వేగంగా, సులభంగా అందించేందుకు ఈ వెటర్నరీ స్టాండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని కార్యక్రమానికి హాజరైన అతిథులు పేర్కొన్నారు.
ఈ వెటర్నరీ స్టాండ్ ఏర్పాటుకు శ్రీ ఫాస్ట్ ఐఎంపీ ఎరుకుల రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించారని గోశాల నిర్వాహకులు తెలిపారు. ఆయన సహకారంతో గోవులకు మెరుగైన వైద్య సేవలు అందించే సౌకర్యం గోశాలలో అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. దీనివల్ల గోవులకు చికిత్స, ఆరోగ్య పరీక్షలు, అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని వెల్లడించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఈసీ పూర్ణిమ, ఐపీసీ అరుణ, ఐపీసీ వుడా రాము, ఐపీసీ వెలగ నారాయణరావు, ఆర్సీ శిరం లక్ష్మణరావు, ఆర్ఎస్ కనకరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ఆయుష్మాన్ ప్రెసిడెంట్, నర్సీపట్నం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శిరం లక్ష్మణరావుతో పాటు పలువురు సామాజిక సేవకులు, గోభక్తులు, గోశాల సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గో సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, గోశాలల్లో ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించడం ద్వారా మూగజీవాల ప్రాణాలను కాపాడటానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. బలిఘట్టం గోశాల నిర్వహణ కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమం చివరలో సుఖీభవ క్లబ్ తరఫున వెటర్నరీ స్టాండ్ ఏర్పాటుకు సహకరించిన దాతలు, అతిథులు, సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. గోశాల అభివృద్ధికి మరిన్ని దాతలు ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.