జూలై 15 నుంచి ఆగస్టు 29 వరకు నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు 17, 23 ఏళ్లలోపు బాలబాలికలకు 12 క్రీడాంశాల్లో పోటీలు

అనకాపల్లి, జూలై 10 (స్పీడ్ న్యూస్):
నేషనల్ స్పోర్ట్స్ డే-2026–27 వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్-2026 పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను వెలికితీసి యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయిలో అవకాశాలు కల్పించడమే అమరావతి ఛాంపియన్షిప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 17 ఏళ్లలోపు, 23 ఏళ్లలోపు బాలురు, బాలికలకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జూలై 15 నుంచి ఆగస్టు 29 వరకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దశలవారీగా పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ మాట్లాడుతూ, పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఏపీ) వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డు ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభను చాటాలని ఆమె కోరారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లాలో క్రీడా వర్గాల్లో ఉత్సాహాన్ని నింపగా, అమరావతి ఛాంపియన్షిప్ విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.