143 మందికి కంటి పరీక్షలు.. 38 మంది ఆపరేషన్‌కు ఎంపిక* *అనకాపల్లి జిల్లా అంధత్వ నివారణ సంస్థ, నర్సీపట్నం సిటీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం*

నర్సీపట్నం, జూలై 08:(స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం పట్టణంలోని సిటీ క్లబ్ ఆవరణలో బుధవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనకాపల్లి సౌజన్యంతో, నర్సీపట్నం సిటీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరుగుతున్న కంటి సమస్యలను నివారించడమే ధ్యేయంగా నిర్వహించిన ఈ ఉచిత శిబిరానికి పరిసర ప్రాంతాల ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ఈ ఉచిత శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు అత్యాధునిక పరికరాలతో మొత్తం 143 మంది రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో తీవ్రమైన శుక్లాల సమస్యలతో బాధపడుతున్న 38 మందిని ఉచిత కంటి ఆపరేషన్ల నిమిత్తం ఎంపిక చేశారు. ఎంపికైన రోగులను శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వాహనంలో సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. వీరికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సాధారణ కంటి సమస్యలతో పాటు క్లిష్టమైన సమస్యలతో బాధపడుతున్న పలువురు రోగులను గుర్తించి, వారిని శంకర్ ఫౌండేషన్ ప్రధాన ఆసుపత్రిలోని స్పెషలిస్ట్ వైద్యుల వద్దకు రెఫర్ చేశారు. ఇందులో:కంటి నరాల చికిత్స కోసంఒక్కరు కంటి పై పొర చికిత్స కోసం నలుగురు కంటి నీటి కాసుల గ్లకోమా చికిత్స కోసం ఒక్కరు కంటి రెప్పల చికిత్స కోసం ఒక్కరు చిన్నపిల్లల కంటి సమస్యల చికిత్స కోసం ఒక్కరు చొప్పున రోగులను గుర్తించి, వారికి తదుపరి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా రెఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమంలో నర్సీపట్నం సిటీ క్లబ్ ప్రెసిడెంట్ పల్లా దొరబాబు, క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ దొరబాబు మాట్లాడుతూ.. పేద ప్రజల చెంతకే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను తీసుకురావాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ శిబిరంలో శంకర్ ఫౌండేషన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ దీపక్, క్యాంపు మేనేజర్ ఎం. అరుణ్ కుమార్, నర్సింగ్ స్టాఫ్ విజయకుమారి మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని రోగులకు సేవలు అందించారు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి, ఆపరేషన్లకు తరలించడంపై స్థానిక ప్రజలు, రోగులు నిర్వాహకులకు, వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.