సహపంక్తి భోజనాలతో సామాజిక ఐక్యతకు నిదర్శనం ప్రతి ఏటా ఇదే ఉత్సాహంతో నిర్వహిస్తా. ..దత్తుడు

నర్సీపట్నం, జూలై 8: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేమలపూడి పంచాయతీ శివారు బంగారుపేట గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి, ప్రజానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నాయకులు దత్తుడు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రజాసేవ, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సంక్షేమ పాలనకు కొత్త దిశానిర్దేశం చేసిన నాయకుడిగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
అనంతరం గ్రామంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలందరినీ ఒకే చోటకు ఆహ్వానించి సహపంక్తి భోజనాలను నిర్వహించారు. చిన్నా, పెద్దా, మహిళలు, యువకులు, వృద్ధులు కలిసి ఒకే వరుసలో భోజనం చేయడం ద్వారా సామాజిక ఐక్యత, సోదరభావం ప్రతిఫలించిందని నిర్వాహకులు తెలిపారు. గ్రామస్థులంతా స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని పేర్కొన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇప్పటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. అలాంటి మహానేత జయంతిని ప్రతి సంవత్సరం ఇదే ఉత్సాహంతో నిర్వహిస్తూ, ఆయన ఆశయాలను భావితరాలకు తెలియజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
దత్తుడు మాట్లాడుతూ, బంగారుపేట గ్రామంలో ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఈసారి కూడా విజయవంతంగా నిర్వహించామని, భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, అభిమానుల నినాదాలతో కొనసాగి బంగారుపేట గ్రామంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది.