భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం.

ఎస్. రాయవరం, అనకాపల్లి జిల్లా:(స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో శ్రీ ఉమా సమేత అన్నపూర్ణేశ్వర, విఘ్నేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి చింతకాయల పద్మావతి ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం ఆలయానికి చేరుకున్న స్పీకర్ దంపతులకు వేద పండితులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి నారాయణ సోమయాజులు, పేరి పృథ్విచరణ్ శర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్ణయించిన శుభముహూర్తంలో శ్రీ ఉమా సమేత అన్నపూర్ణేశ్వర, విఘ్నేశ్వర స్వామివార్ల విగ్రహాలతో పాటు యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, ప్రత్యేక అర్చనలు, హారతులు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను సమర్పించారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి శుభసూచకమని అన్నారు. శివుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి సోమవారం శివారాధన చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు దైవానుగ్రహం లభిస్తుందని తెలిపారు.
ఈ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లాలం కాశీనాయుడు, దండు అచ్యుతరామరాజు (బుల్లి చంటి), మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబ్బడం, పీఏసీఎస్ చైర్‌పర్సన్ తుమ్మపాల నాగేశ్వరరావు, గుర్రం రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.