*భారత్ వికాస్ పరిషత్ 11వ రోజు సేవా కార్యక్రమం విజయవంతం*

(స్పీడ్ న్యూస్): సమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న భారత్ వికాస్ పరిషత్ శ్రీ రాణి రుద్రమదేవి శాఖ, అల్లూరి సీతారామరాజు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 11వ రోజు సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల, ఇసుకతోటలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
శిబిరంలో ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ సుశీల విద్యార్థులకు దంతాల సంరక్షణ, నోటి పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. రోజుకు రెండు సార్లు పళ్లు తోమడం, పోషకాహారం తీసుకోవడం, మిఠాయిలు, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని నిర్వహించి, దంతాల ఆరోగ్యంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ దంతాలను ఆరోగ్యంగా కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ శ్రీ రాణి రుద్రమదేవి శాఖ అధ్యక్షురాలు టి. సత్యశ్రీ లక్ష్మీదేవి, రామాదేవి, డాక్టర్ సుశీల, జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్.వి. లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించడం లక్ష్యంగా భారత్ వికాస్ పరిషత్ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత దంత వైద్య శిబిరం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందనను పొందింది.