నర్సీపట్నం, జూలై 7:(స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక చొరవ చూపారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, స్టేషన్ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు నిర్లక్ష్యంగా ఉండటంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ప్రజలకు ఆదర్శంగా కనిపించేలా సుందరీకరణ పనులు చేపట్టాలని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీసు సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
స్టేషన్‌కు పటిష్టమైన ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు పోలీసు సిబ్బంది వినియోగానికి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ వరకు తరచూ నీరు నిలిచిపోతున్న సమస్యను దృష్టిలో ఉంచుకుని, ఆ ప్రాంతంలో సమగ్ర డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు అత్యవసరంగా సిద్ధం చేసి తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని స్పీకర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ డీఈ విద్యాసాగర్, పంచాయతీరాజ్ డీఈ ఈశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ గఫూర్, రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్ఐ ఉమామహేశ్వరరావు తదితర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.