మ్యాపింగ్, డిజిటలైజేషన్‌ను 100 శాతం పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు ఆదేశం

నర్సీపట్నం, జూలై 7:(స్పీడ్ న్యూస్) అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం రూరల్ పరిధిలోని గబ్బాడ గ్రామ సచివాలయాన్ని తహశీల్దార్ ఎల్. రామారావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా గబ్బాడ గ్రామంలోని 182, 183 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 182 పోలింగ్ కేంద్రంలో 72 శాతం, 183 పోలింగ్ కేంద్రంలో 68 శాతం మేర మ్యాపింగ్ పూర్తయిందని అధికారులు తహశీల్దార్‌కు వివరించారు. మిగిలిన పనులను వేగవంతం చేసి ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
తహశీల్దార్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి వారి వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో నిర్వహించాలని బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓలు) సూచించారు. మిగిలిన ఓటర్ల వివరాలను త్వరితగతిన సేకరించి ఏఎస్డీ జాబితాలను సిద్ధం చేసి ఎన్నికల నమోదు అధికారికి (ఈఆర్‌ఓ) సమర్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఓటర్ల పేర్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సంబంధిత ఓటర్లకు ముందుగా నోటీసులు జారీ చేసి చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తయిన అనంతరమే పేర్ల తొలగింపు చేపట్టాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ప్రతి అంశాన్ని గ్రామ పెద్దలు, బూత్ లెవల్ ఏజెంట్లతో పంచుకుంటూ సమిష్టిగా పనిచేస్తేనే ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమని తహశీల్దార్ పేర్కొన్నారు. గడువులోగా 100 శాతం మ్యాపింగ్, డిజిటలైజేషన్ పూర్తి చేసి పారదర్శకమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని బీఎల్‌ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.