నర్శీపట్నం (speed news ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎం.ఎస్. నెం. 396ను రద్దు చేయాలని కోరుతూ నర్శీపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, జీవో నెం. 396 అమలుతో రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేట్ సంస్థల జోక్యం పెరిగే అవకాశముందని తెలిపారు. దీంతో ప్రజల ఆస్తులకు సంబంధించిన వివరాల గోప్యత, భద్రత దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పరోక్షంగా సహకరిస్తున్న తమను విస్మరించకుండా, వృత్తికి రక్షణ కల్పించాలని వారు కోరారు. జీవో నెం. 396ను తక్షణమే పునఃపరిశీలించి రద్దు చేయడంతో పాటు దస్తావేజు లేఖరులకు అధికారిక లైసెన్సులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఆస్తుల భద్రత, వృత్తి గౌరవం, ప్రజల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను సానుభూతితో పరిశీలించి న్యాయం చేయాలని దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరారు.