మీరు చూపించిన సిసి ఫుటేజ్ కరెక్టే మరి 7:30 తర్వాత కూడా ఏమి జరిగిందో చూపించండి అంటున్న మాజీ ఎమ్మెల్యే గణేష్..

నర్సీపట్నం, జూలై 5(స్పీడ్ న్యూస్) : నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ కార్యకర్త నూకరాజుపై జరిగినట్లు ఆరోపణలు వెలువడిన ఘటన రాజకీయంగా, పరిపాలనాపరంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గణేష్ చేసిన ఆరోపణలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ప్రదర్శించారు. బాధితుడు నూకరాజును పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన సమయం నుంచి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నమోదైన సీసీటీవీ ఫుటేజ్‌ను చూపించినట్లు తెలిసింది.
అయితే, ఈ ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గణేష్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. రాత్రి 7 గంటల తర్వాత నూకరాజును స్టేషన్ నుంచి విడుదల చేసే వరకు జరిగిన పరిణామాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. అసలు నిజానిజాలు బయటకు రావాలంటే ఆ సమయానికి సంబంధించిన పూర్తి వీడియోను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, డీఎస్పీ చూపించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆడియో లేకపోవడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియో మాత్రమే చూపించడం వల్ల పూర్తి వాస్తవాలు బయటకు రావని, ఆడియో కూడా ఉంటే అక్కడ జరిగిన సంభాషణలు, పరిస్థితులు ప్రజలకు స్పష్టంగా తెలిసేవని పేర్కొన్నారు.
స్టేషన్‌లోనే గాయాలు అయినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు బాధితుడికి వెంటనే వైద్య పరీక్షలు లేదా చికిత్స ఎందుకు అందించలేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు. పోలీసుల కనీస బాధ్యత ఏమైందని, ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై వెంటనే స్పందించాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.
తాను మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో చేసినవి కావని, బాధితుడు నూకరాజు తనకు వివరించిన విషయాల ఆధారంగానే మాట్లాడానని గణేష్ స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం తనకు లేదని, నిజం బయటపడాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చానని తెలిపారు.
నిజంగా పోలీసులు తప్పు చేయకపోతే రాత్రి 7 గంటల నుంచి నూకరాజును విడుదల చేసే వరకు ఉన్న పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రజలకు విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే ఈ ఘటనపై ఉన్న అనుమానాలు తొలగుతాయని, ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై బాధితుడు నూకరాజు భార్య కూడా డీఎస్పీ శ్రీనివాసరావుకు అధికారికంగా ఫిర్యాదు చేసారు. తన భర్తపై పోలీసుల దుర్వ్యవహారం జరిగిందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు

ఈ ఘటన ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేస్తారా? బాధితుడి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేపడతారా? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యవహారంలో పోలీసు శాఖ తదుపరి తీసుకునే చర్యలపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.