నర్సీపట్నం (స్పీడ్ న్యూస్) సమయంలో రైతులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం నర్సీపట్నం మండలం వేములపూడి రెవెన్యూ పరిధిలో సుమారు 2,200 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను టీడీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతకాయల రాజేష్ మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పారదర్శకమైన భూ పరిపాలనకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించి పంపిణీ చేశారని విమర్శించిన ఆయన.. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రాజముద్రతోనే పాస్ పుస్తకాలను జారీ చేస్తోందని తెలిపారు.
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయడం వల్ల రైతులు తమ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పుడైనా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. భూమి రికార్డుల్లో పారదర్శకత పెంచేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
నర్సీపట్నం అభివృద్ధికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాజేష్ పేర్కొన్నారు. గత రెండేళ్లలోనే నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జడ్పీటీసీ రమణమ్మ, బిలేం రాంప్రసాద్, లాలం శ్రీరంగం స్వామి, ధనమిరెడ్డి మధు, తహసీల్దార్ రామారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.