రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా స్వస్థలం నర్సీపట్నానికి వచ్చిన చింతకాయల విజయ్‌కు ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పట్టణమంతా పండుగ వాతావరణాన్ని తలపించగా, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చి అభినందనలు తెలిపారు.
నర్సీపట్నం ప్రధాన వీధులు పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించబడ్డాయి. డప్పులు, బ్యాండ్ మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. విజయ్ వాహనం పట్టణంలోకి చేరుకోగానే కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తూ పూలవర్షం కురిపించారు.
ముందుగా శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చింతకాయల విజయ్, అనంతరం వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు రహదారుల ఇరువైపులా నిలబడి ఆయనకు అభివాదం చేశారు.
ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన అభినందన సభకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభలో పలువురు నేతలు విజయ్ రాజకీయ ప్రస్థానం, పార్టీ కోసం చేసిన సేవలను కొనియాడారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పిన్న వయసులో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడం గర్వకారణమన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడకుండా నిలిచిన నాయకుడిగా విజయ్‌ను ప్రశంసించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర నేతలు కూడా ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు.
సభలో ప్రసంగించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఇది సన్మాన సభ కాదని, ప్రజల ఆశీర్వాద సభ అని పేర్కొన్నారు. నర్సీపట్నం ప్రజలు తమ కుటుంబంపై చూపుతున్న ప్రేమకు రుణపడి ఉంటామని, అభివృద్ధి ద్వారానే ఆ రుణాన్ని తీర్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
చివరిగా ప్రసంగించిన రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. తాను ఈ స్థాయికి రావడానికి పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, నర్సీపట్నం ప్రజల ఆశీర్వాదమే కారణమని చెప్పారు. కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరువనని, ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడతానని హామీ ఇచ్చారు.
"ఎప్పటికీ పార్టీ జెండాకు కూలీగానే పనిచేస్తాను. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను" అని విజయ్ స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని, రాజ్యసభ వేదికగా అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
సభ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది ప్రజలు విజయ్‌ను కలిసేందుకు పోటీపడగా, ఇటీవల నర్సీపట్నంలో జరిగిన అతిపెద్ద రాజకీయ సభల్లో ఇదొకటిగా నిలిచిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి.