కేరళం’ బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు.. వలసవాద ఆనవాళ్లను చెరిపేస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: ఆగష్టు12 ( స్పీడ్ న్యూస్ )
కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. పేర్లతో ముడిపడి ఉన్న భావోద్వేగాలను, బిల్లులోని రాజ్యాంగ విలువలను తాను గౌరవిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ వ్యక్తి ఒక పేరును ‘మావిగన్’గా మార్చేందుకు ప్రయత్నించారని ఎంపీ విజయ్ ప్రస్తావించారు. అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో రాజ్యాంగపరమైన ప్రక్రియ ద్వారా ఒక బిల్లు ఆమోదం పొందిన అనంతరం, దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలపై గౌరవం లేని వారు ప్రస్తుతం ఆ పేరును వ్యతిరేకిస్తున్నారని విజయ్ విమర్శించారు. తాను చర్చను పక్కదారి పట్టించడం లేదని, కేవలం బిల్లుతో ముడిపడి ఉన్న రాజ్యాంగ విలువల గురించే మాట్లాడుతున్నానని చైర్‌కు ఆయన వివరణ ఇచ్చారు.
‘కేరళం’ అనే పేరుతో ముడిపడి ఉన్న భావోద్వేగాలను గౌరవిస్తూ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. దేశంలో వలసవాద ఆనవాళ్లను తొలగిస్తూ భారతీయ మూలాలు, సంప్రదాయాలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పేర్ల మార్పు విషయంలో రాజ్యాంగబద్ధమైన విధానాలు, ప్రజల భావోద్వేగాలను గౌరవించడం అత్యంత ముఖ్యమని ఎంపీ విజయ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.