నర్సీపట్నం: ఆగష్టు 12 ( స్పీడ్ న్యూస్ )
పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలపై నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌తో పాటు మరో 27 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని నర్సీపట్నం పట్టణ సీఐ షేక్ గఫూర్ బుధవారం వెల్లడించారు.
ఈ నెల 10న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ర్యాలీ నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు.
పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారనే అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్‌తో పాటు మరో 27 మందిని కేసులో నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.
ర్యాలీలు, సభలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీఐ షేక్ గఫూర్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.