నర్సీపట్నం ప్రాంతానికి 7 వాహనాలు.. 102కు కాల్ చేస్తే తక్షణ సేవలు

నర్సీపట్నం:ఆగష్టు 11 ( స్పీడ్ న్యూస్ )
గర్భిణీలు, బాలింతలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘తల్లీబిడ్డ’ వాహన సేవలను నర్సీపట్నంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు, బాలింతలకు రవాణా ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సురక్షితంగా వారి స్వగ్రామాలకు, ఇళ్లకు చేర్చడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
గత కాంట్రాక్టు రద్దు.. కొత్త సంస్థకు బాధ్యతలు
గత ప్రభుత్వ హయాంలో ‘తల్లీబిడ్డ’ వాహనాల నిర్వహణ బాధ్యతలను అరవిందో సంస్థకు అప్పగించారని, అయితే ఆ సంస్థ నుంచి ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో తమ ప్రభుత్వం ఆ కాంట్రాక్టును రద్దు చేసిందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవల నిర్వహణ బాధ్యతలను విద్యా వేద ఫౌండేషన్ సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, అందులో భాగంగా నర్సీపట్నం ప్రాంతానికి మొత్తం ఏడు ‘తల్లీబిడ్డ’ వాహనాలను కేటాయించినట్లు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతమైన నక్కపల్లిలో అత్యవసర సేవలకు ఒక వాహనాన్ని అందుబాటులో ఉంచగా, మరో ఆరు వాహనాలు నర్సీపట్నం ప్రాంతంలో సేవలందిస్తాయని స్పష్టం చేశారు.
102కు ఫోన్ చేస్తే తక్షణ సేవలు
గర్భిణీలు, బాలింతలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ‘తల్లీబిడ్డ’ వాహన సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.
గర్భిణీలకు వాహనం అవసరమైన సమయంలో 102 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే, సెంట్రల్ ఆఫీస్ ద్వారా సమీపంలోని వాహనాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ఆసుపత్రిలో రక్త పరీక్షల కోసం ప్రత్యేక గది
నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ తెలిపారు. ఆసుపత్రిలో రక్త పరీక్షల కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి, అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గర్భిణీలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.