అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందేలా కృషి: టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్

నర్సీపట్నం, ఆగస్టు 9: ( స్పీడ్ న్యూస్)
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ఎంతో భరోసానిస్తోందని పేర్కొన్నారు.
నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను చింతకాయల రాజేష్ పంపిణీ చేశారు. ఒకేరోజు నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీకి చెందిన మొత్తం 18 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల 16 వేల విలువైన చెక్కులు అందజేశారు.
గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాలకు చెందిన ముగ్గురు చొప్పున మొత్తం 12 మందికి, నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఆరుగురికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది.
ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ.. అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి సంజీవనిలా ఉపయోగపడుతోందన్నారు. గత ఏడాది కాలంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో 288 మందికి పైగా బాధితులకు సుమారు రూ.2.47 కోట్ల మేర ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ప్రజల కష్టాలను గుర్తించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన వారికి సీఎం సహాయనిధి ద్వారా సాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని రాజేష్ హామీ ఇచ్చారు.
కష్టకాలంలో తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడులకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో బలాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమణమ్మ, తాండవ కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టీడీపీ పట్టణ కార్యదర్శి లాలం మురళీకృష్ణ, మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.వై.పాత్రుడు, నర్సీపట్నం మండల పార్టీ అధ్యక్షుడు సుకల అప్పలనాయుడు, నాయకులు అడిగర్ల నానిబాబు, శ్రీరంగం స్వామి, బోలెం చిన్నబాబుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.