నర్సీపట్నం, ఆగస్టు 8: (స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం పట్టణంలోని 25వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వార్డు మహిళలు హారతులు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పద్మావతి, రాజేష్‌లు వార్డులో ఇంటింటికీ తిరిగి గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రూ.70.59 లక్షల పనులకు శ్రీకారం
25వ వార్డులో మొత్తం రూ.70 లక్షల 59 వేల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూ.25.24 లక్షలతో పూర్తయిన ఐదు సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించారు. మరో రూ.45.35 లక్షలతో చేపట్టనున్న నూతన పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ప్రజల ఆదరాభిమానాలు మరువలేం: పద్మావతి
చింతకాయల పద్మావతి మాట్లాడుతూ.. 25వ వార్డు ప్రజలు తమకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు. ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహకారంతో నర్సీపట్నంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.
కౌన్సిలర్‌గా రాజేష్‌ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో ఇంకా మిగిలిన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని హామీ ఇచ్చారు.
రూ.242 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి: రాజేష్
చింతకాయల రాజేష్ మాట్లాడుతూ.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో నర్సీపట్నం మున్సిపాలిటీకి రూ.242 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, కాలువల కోసం రూ.32 కోట్లు, చెత్త నిర్వహణకు రూ.3.50 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
పట్టణంలో 1,050 పాత వీధి దీపాలను మరమ్మతులు చేయడంతో పాటు 750 కొత్త వీధి దీపాలు, 140 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
త్వరలో మరిన్ని రోడ్లు, కాలువల పనులు
25వ వార్డులో సరస్వతి ప్రెస్ రోడ్డు, తోటవారి సందులో నూతన రోడ్లు నిర్మించినట్లు రాజేష్ తెలిపారు. వినాయకుడి గుడి వెనుక నుంచి ముత్యాలమ్మ జంక్షన్ వరకు రోడ్డు, కాలువ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని రాజేష్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, 28వ వార్డు ఇంచార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.