మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.242 కోట్ల నిధులు.. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం నర్సీపట్నం 27వ వార్డులో రూ.1.18 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

నర్సీపట్నం, ఆగస్టు 7 ( స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలోని 27వ వార్డు శివపురంలో రూ.1.18 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శుక్రవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. రూ.69 లక్షల 85 వేల వ్యయంతో పూర్తయిన 12 సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు, రూ.49 లక్షల 10 వేలతో చేపట్టనున్న కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక మహిళలు వారికి హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి అభివృద్ధి పనులను ప్రారంభించి, కొబ్బరికాయ కొట్టి కొత్త పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం మున్సిపాలిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. చెత్తను తరలించే ట్రాక్టర్లకు ఇంధనం కూడా లేకపోయే పరిస్థితి ఉండేదని, పైపులైన్ల కోసం తవ్విన రోడ్లను అలాగే వదిలేయడంతో పట్టణ అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.32 కోట్లు, ఇంటింటికీ కుళాయి పథకానికి రూ.185 కోట్లు తీసుకువచ్చామని తెలిపారు. డంపింగ్ యార్డు అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించి చెత్త ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, మొత్తం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.242 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.
వార్డు ఇన్‌చార్జ్ పైల గోవిందు మాట్లాడుతూ, 27వ వార్డుకు మొత్తం రూ.1.18 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అందులో రూ.69.85 లక్షల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రూ.49.10 లక్షల పనులకు నేడు శంకుస్థాపన చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పనులు నిలిచిపోయేవని విమర్శిస్తూ, ప్రస్తుతం ప్రారంభించిన పనులను నెల రోజుల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. శివపురం ప్రాంతంలో కళ్యాణ మండపం నిర్మించాలని కూడా ఆయన కోరారు.
స్థానిక నాయకుడు తాతీలు మాస్టారు మాట్లాడుతూ, శివపురం ప్రజలు ఎప్పుడూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు. గత ఐదేళ్లలో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభివృద్ధిని కొనసాగించే నాయకత్వానికే ప్రజలు మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, కాశీరత్నం, బొచ్చా తాతాజీ, రుత్తల సత్యనారాయణ, సబ్బవరపు పెదబాబు, సీరారెడ్డి శ్రీను, మణికంఠ, రామకృష్ణ, 28 వార్డుల ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.