జాతీయ స్థాయిలో మంగళగిరి చేనేత వైభవాన్ని చాటిచెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు - చేనేత కళాకారుల శ్రమ, నైపుణ్యానికి గుర్తింపుగా ప్రత్యేక బహూకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ( స్పీడ్ న్యూస్) జాతీయ చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ తదితర ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచిన మంగళగిరి చేనేత వస్త్రాన్ని ప్రధానమంత్రి మోడీకి బహూకరించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈ చేనేత వస్త్రం మన సంప్రదాయ కళాకారుల నైపుణ్యానికి, శ్రమకు ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
మంగళగిరి చేనేత వస్త్రాన్ని దేశ ప్రధానమంత్రికి అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవం, కళాకారుల ప్రతిభ జాతీయ స్థాయిలో మరోసారి వెలుగులోకి వచ్చిందని నాయకులు తెలిపారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, కళాకారుల సంక్షేమంపై ఉన్న నిబద్ధతకు ఈ భేటీ నిదర్శనంగా నిలిచిందన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం చేనేత కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, మంగళగిరి చేనేతకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.