అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం, ఆగస్టు 6: ( స్పీడ్ న్యూస్) నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డుల్లో రూ.1.81 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను గురువారం ఘనంగా ప్రారంభించారు. పీనారిపాలెం, కళాసి కాలనీ, బీసీ కాలనీ, చాకలి కాలనీలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఒకటో వార్డులో రూ.84 లక్షలు, రెండో వార్డులో రూ.64 లక్షలతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, రెండో వార్డులో మరో రూ.33 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వార్డు మహిళలు మేళతాళాలు, డీజే సౌండ్‌లు, కోలాటాలతో అతిథులకు ఘన స్వాగతం పలికారు. కొత్తగా ప్రారంభించిన రోడ్ల వద్ద కేక్ కట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీసీ కాలనీలో స్వర్గీయ చింతకాయల వరహాలు దొరకు పద్మావతి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, 1, 2వ వార్డులు అయ్యన్నపాత్రుడికి పుట్టినిల్లు లాంటివని, అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటాయని అన్నారు. గత రెండేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి వేగవంతం చేశామని, నర్సీపట్నం మున్సిపాలిటీకి రూ.242 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. అందులో రూ.185 కోట్లతో ఇంటింటికీ తాగునీటి ప్రాజెక్టు, రూ.32 కోట్లతో 189 సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు, రూ.2 కోట్లతో జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో చెత్త ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పట్టణంలోని 28 వార్డుల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
వార్డు ఇంచార్జ్ లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ, నలభై ఏళ్ల క్రితం అయ్యన్నపాత్రుడు చొరవతో ఏర్పాటైన బీసీ, కళాసి, చాకలి కాలనీలకు ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు, డ్రైన్లు మంజూరు చేయడం ఆనందదాయకమన్నారు. వార్డుల్లో ప్రజల సమస్యలను పద్మావతి స్వయంగా తెలుసుకుని ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్‌పర్సన్ ఆదిలక్ష్మి, కౌన్సిలర్లు, నాయకులు వరహాలమ్మ, డాబా శ్రీను, రాజేశ్వరరావు, లోవ, శేఖర్, మోహన్, పెదప్పలనాయుడు, పెంటేష్, కూటమి కుటుంబ సభ్యులు, వార్డు మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.