న్యూఢిల్లీ, ఆగస్టు 5:( స్పీడ్ న్యూస్)
పార్లమెంట్ రాజ్యసభలో ప్రతిపాదించిన *'సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (సవరణ) బిల్లు–2026'*కు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచడం సకాలంలో తీసుకున్న నిర్ణయమని ఆయన అభినందించారు.
సభలో మాట్లాడిన విజయ్, దేశంలో సత్వర న్యాయం అందించేందుకు ఈ-కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. అలాగే అమరావతిలో న్యాయ మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ను కొనియాడారు.
"చట్టం ముందు సామాన్యుడైనా, అత్యంత బలవంతుడైనా సమానుడే. న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించబడటమే" అని విజయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై నమోదైన సీబీఐ, ఈడీ అక్రమాస్తుల కేసులను ప్రస్తావిస్తూ, 2013లో నమోదైన కేసులు 13 ఏళ్లు గడిచినా విచారణ పూర్తి కాలేదని అన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లు, న్యాయమూర్తుల బదిలీల కారణంగా విచారణ జాప్యం జరుగుతోందని విమర్శించారు.
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సకాలంలో విచారణ ఎదుర్కొని న్యాయం జరిగేలా చూడాలని, సుదీర్ఘ జాప్యాల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.
భారత జనాభా 150 కోట్లకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించాల్సిన అవసరం ఉందని విజయ్ అన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులు, దిగువ కోర్టులు, ముఖ్యంగా ప్రత్యేక సీబీఐ కోర్టులను బలోపేతం చేసి కేసుల విచారణను వేగవంతం చేయాలని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.