పట్టణంలో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా: పద్మావతి నర్సీపట్నం అభివృద్ధికి అయ్యన్నపాత్రుడు కుటుంబమే కారణం: వార్డు ఇన్‌చార్జ్ ధనిమిరెడ్డి మధు

నర్సీపట్నం, ఆగస్టు 4:( స్పీడ్ న్యూస్)
కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నర్సీపట్నం పట్టణంలోని 24వ వార్డులో రూ.1.54 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. వర్షంలోనే రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, నర్సీపట్నం పట్టణంలో రూ.32 కోట్ల వ్యయంతో 189 రహదారులు, కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కూటమి ప్రభుత్వ సహకారంతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు.
వార్డు ఇన్‌చార్జ్ ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ, 24వ వార్డు అభివృద్ధికి రూ.1.54 కోట్ల నిధులు మంజూరు చేసి రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులను ఆధునికంగా నిర్మించారని తెలిపారు. ఒకప్పుడు సమస్యలతో ఉన్న ప్రాంతం నేడు ఆదర్శవంతమైన వార్డుగా మారిందని చెప్పారు. మిగిలిన రోడ్ల పనులకు కూడా త్వరలోనే నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామని అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారని వెల్లడించారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, అయ్యన్నపాత్రుడు ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నారని మధు కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శిస్తూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న శాశ్వత మౌలిక వసతుల పనులతో ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తోందని అన్నారు.
భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వార్డు ప్రజలు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.