అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ( ఆగష్టు 4) స్పీడ్ న్యూస్
ఎల్ నీనో వాతావరణ ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక వరి పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, వరి సాగు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పంట బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. రైతులు ఆగస్టు 15వ తేదీలోపు ఎకరానికి కేవలం రూ.84 చెల్లించి తమ వరి పంటకు బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.
రైతుల సౌకర్యార్థం కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), ఆధార్ అప్‌డేట్ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో కూడా బీమా నమోదు సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు.
బీమా నమోదు కోసం 1B పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికెట్, కౌలు రైతులైతే కౌలు ఒప్పంద పత్రం లేదా గ్రామ సర్పంచ్/వీఆర్వో ధృవీకరణ పత్రం, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ (ఓటీపీ కోసం) వెంట తీసుకురావాలని సూచించారు.
అలాగే, నాట్లు పూర్తయిన 15 నుంచి 30 రోజులలోపు 'ఈ-పంట'లో వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని, అలా నమోదు చేసిన రైతులకు ఎకరానికి రూ.42,400 వరకు బీమా పరిహారం అందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పంట బీమాపై విస్తృత అవగాహన కల్పించి, ప్రతి అర్హ రైతు బీమా పొందేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఆగస్టు 15లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి వరి రైతు తన పంటకు బీమా రక్షణ కల్పించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.