నర్సీపట్నం, ఆగస్టు 3:( స్పీడ్ న్యూస్)
మత్తు పదార్థాల నిర్మూలన, యువతను గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలనే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నర్సీపట్నంలోని స్టార్ హోమ్స్‌లో సోమవారం ఘనంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందు విద్యార్థులు మత్తు పదార్థాల దుష్ప్రభావాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు నిర్వహించి అందరినీ ఆలోచింపజేశారు. అనంతరం మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి పోలీసు శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. అయితే కేవలం అవగాహన సదస్సులతోనే సరిపెట్టకుండా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
గంజాయి వ్యాపారులు విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వారిని అక్రమ రవాణాకు వాహకాలుగా ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, పిల్లల ఖర్చులు, విలాసవంతమైన బైకుల వినియోగం వంటి అంశాలను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలని కోరారు. గతంలో గంజాయి ముఠాల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం కూడా అదే తరహాలో అక్రమ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నర్సీపట్నం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 65 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని స్పీకర్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత చదువుపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, ప్రజల సహకారంతో మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు బ్రహ్మాజీ కూడా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేశారు.