స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ చింతకాయల విజయ్, పద్మావతి చేతుల మీదుగా శాలువా, జ్ఞాపికతో సత్కారం విద్యారంగానికి నాలుగు దశాబ్దాల సేవలు అమూల్యం..సమాజానికి మార్గదర్శిగా కొనసాగాలని ఆకాంక్ష

నర్సీపట్నం, ఆగస్టు 3:(స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విద్యారంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందించి ఇటీవల పదవీ విరమణ పొందిన ప్రముఖ ఉపాధ్యాయులు బొడ్డు సహదేవుడు సాయి మాస్టారుకు ఘన సన్మానం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు చింతకాయల విజయ్, శ్రీమతి చింతకాయల పద్మావతి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, సాయి మాస్టారు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఆదర్శ గురువని కొనియాడారు. వేలాది మంది విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, నైతిక విలువలను అందించి భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు.
ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతూ, పదవీ విరమణ అనేది ఉద్యోగానికే పరిమితమని, సమాజ సేవకు కాదని పేర్కొన్నారు. సాయి మాస్టారు తన అనుభవాన్ని యువతకు పంచుకుంటూ సమాజానికి మార్గదర్శిగా కొనసాగాలని ఆకాంక్షించారు.
సన్మానానికి స్పందించిన సాయి మాస్టారు తనకు లభించిన గౌరవం జీవితంలో మరపురాని గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు. తన ఉపాధ్యాయ జీవితంలో సహకరించిన సహచరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మాజీ విద్యార్థులు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి మాస్టారుకు అభినందనలు తెలియజేశారు.