నర్సీపట్నం, జూలై 30:( స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం నియోజకవర్గంలో గురువారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగాయి. మాకవరపాలెం మండలం గండికోటలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ కృష్ణాపురంలో ఆయన సతీమణి చింతకాయల పద్మావతి పర్యటించి సామాజిక పెన్షన్ల పంపిణీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు హారతులు, పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.
గండికోటలో జరిగిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, తన కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వకారణమని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసినందుకే పార్టీ నాయకత్వం విజయ్‌కు ఈ అవకాశం కల్పించిందని చెప్పారు. ఎంపీగా లభించే నిధులను ప్రాంత అభివృద్ధికి వినియోగించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
రాష్ట్రంలో 62 లక్షలకు పైగా పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.2,712 కోట్లు పంపిణీ చేస్తున్నామని, అనకాపల్లి జిల్లాలో 2.53 లక్షల మందికి రూ.108 కోట్లు, నర్సీపట్నం నియోజకవర్గంలో 41,236 మందికి రూ.17.54 కోట్లు, మాకవరపాలెం మండలంలో 9,894 మందికి రూ.4.24 కోట్లు అందిస్తున్నామని వివరించారు. కొత్తగా పలువురికి స్పౌస్ పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
మాకవరపాలెం మండలానికి రూ.114 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, భీమవోయినపాలెం పంచాయతీలో ఇప్పటికే రూ.88.70 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని తెలిపారు. గండికోటలో అంతర్గత రోడ్లు, శ్మశానవాటిక అభివృద్ధికి రూ.40 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదే రోజు నర్సీపట్నం మున్సిపాలిటీ 20వ వార్డు కృష్ణాపురంలో చింతకాయల పద్మావతి పర్యటించి సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. రూ.22 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రూ.25 లక్షలతో పూర్తయిన పనులను ప్రారంభించారు. అలాగే కల్లేంపూడిలో రూ.7.80 లక్షల విలువైన పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, కృష్ణాపురం తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయమైన గ్రామమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.4 వేల పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు రూ.242 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.వై.పాత్రుడు, జనసేన నాయకుడు సూర్యచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.