నర్సీపట్నం చారిత్రక ప్రాశస్త్యాన్ని దేశానికి చాటిన విజయ్

న్యూఢిల్లీ: జులై 29 ( స్పీడ్ న్యూస్)
రాజ్యసభలో ప్రవేశపెట్టిన *'నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) బిల్లు'*పై జరిగిన చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ భావోద్వేగభరిత ప్రసంగంతో సభను ఆకట్టుకున్నారు. దేశభక్తి, జాతీయ ఐక్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ప్రాముఖ్యతను వివరించిన ఆయన, తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం ప్రాంత చారిత్రక విశిష్టతను రాజ్యసభ వేదికపై ప్రస్తావించారు.
ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ 'వందేమాతరం' కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని, అది దేశభక్తికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత జాతీయ ఆత్మకు ప్రతీక అని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నర్సీపట్నం ప్రాంతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాలతో ఆ ప్రాంతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ పాలకులు చెట్టుకు కట్టేసి కాల్చి చంపిన దారుణ ఘటనను గుర్తు చేసిన ఎంపీ విజయ్, ఆ చివరి క్షణాల్లో కూడా ఆయన నోటి నుంచి వినిపించిన మాట "వందేమాతరం" అని సభలో భావోద్వేగంగా పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడికి గౌరవంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించడం దేశ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని అన్నారు.
స్వాతంత్ర్య సమరంలో బంకించంద్ర ఛటర్జీ, ఖుదీరామ్ బోస్, వీర్ సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయులు కూడా "వందేమాతరం" స్ఫూర్తితోనే పోరాటం సాగించారని గుర్తుచేశారు. ప్రతి భారతీయుడి జీవితం దేశ సేవకే అంకితం కావాలని, చివరి శ్వాస వరకు "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" నినాదాలు మారుమోగాలని పిలుపునిచ్చారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కవితలను ఉటంకిస్తూ, దేశాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
చివరగా 'వందేమాతరం'కు తగిన గౌరవం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, అలాగే రాజ్యసభలో మాట్లాడే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు ఎంపీ చింతకాయల విజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యసభలో నర్సీపట్నం చరిత్ర, అల్లూరి సీతారామరాజు త్యాగం, దేశభక్తి విలువలను ప్రస్తావిస్తూ ఎంపీ చింతకాయల విజయ్ చేసిన ఈ ప్రసంగం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.