భారీగా తరలివచ్చిన భక్తులు – విశేష పూజలు, పల్లకి సేవ, అన్నసమారాధనతో భక్తి వెల్లివిరిసిన వేడుకలు

నర్సీపట్నం, జూలై 29: ( స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రసిద్ధ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, పల్లకి సేవ, అన్నసమారాధన తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి సాయిబాబా వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, ప్రెసిడెంట్ పెద్దిరెడ్ల చింతల పాత్రుడు (చింటూ) నర్సీపట్నం ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు తెలిపారు. భక్తులందరి సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన పేర్కొన్నారు.
ఉదయం వేకువజామున కాగడ హారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 6.30 గంటలకు నిత్యపూజ, నిత్య హోమం, సాయిబాబా వారికి విశేష అభిషేకాలు భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా సాయి నామస్మరణతో మారుమోగగా, భక్తులు భక్తిపరవశంలో పూజల్లో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు మహా హారతి అనంతరం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 3,000 మందికి పైగా భక్తులు అన్నదానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
సాయంత్రం నిర్వహించిన సాయిబాబా పల్లకి సేవ, అనంతరం పట్టణ వీధుల్లో జరిగిన బాబా వారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు సాయి నామస్మరణ చేస్తూ పల్లకిని అనుసరించగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపౌర్ణమి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పెద్దిరెడ్ల చింతల పాత్రుడు (చింటూ), వైస్ ప్రెసిడెంట్ బొంతు రమేష్, సెక్రటరీ వేగిసాని రాజు, కోశాధికారి ఈశ్వరరావు, కోట్ని రాజశేఖర్, కొడవటి గోపి, పెద్దిరెడ్ల వినోద్, పెద్దిరెడ్ల శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు, సేవాదళ సభ్యులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.