రూ.5 లక్షలతో రెండు సీసీ రోడ్లకు శంకుస్థాపన – ప్రజల సమస్యలు తెలుసుకున్న పద్మావతి అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. విజన్ ఉన్న నాయకుడు అయ్యన్నపాత్రుడే: చింతకాయల పద్మావతి

నర్సీపట్నం, జూలై 28: (స్పీడ్ న్యూస్) నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డు శారదానగర్‌లో మంగళవారం "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా 16వ వార్డు పరిధిలో రూ.77.20 లక్షల వ్యయంతో పూర్తయిన 16 అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను చింతకాయల పద్మావతి ఆవిష్కరించారు. అలాగే VMRDA ఫేజ్-3 కింద రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న రెండు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
పూర్తయిన అభివృద్ధి పనుల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.12.20 లక్షల వ్యయంతో మూడు సీసీ రోడ్లు, రూ.4 లక్షలతో సీసీ డ్రెయిన్, VMRDA ఫేజ్-1 కింద రూ.12 లక్షలతో ఒక సీసీ రోడ్డు, VMRDA ఫేజ్-2 కింద రూ.51 లక్షలతో 11 సీసీ రోడ్లు, డ్రెయిన్‌లు, కల్వర్టుల నిర్మాణాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, విజన్ ఉన్న నాయకత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని, ఆ నాయకత్వాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో శారదానగర్‌లో బురద రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 29 రోజుల్లోనే మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.4.11 కోట్లు తీసుకువచ్చామని తెలిపారు. అనంతరం పార్టీలకు అతీతంగా అన్ని 28 వార్డుల అభివృద్ధి కోసం రూ.32 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి రూ.242 కోట్లు, ఇంటింటికీ మంచినీటి కుళాయిల పథకానికి రూ.180 కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అంధకారంలో ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,085 వీధి దీపాలను మరమ్మతులు చేయడంతో పాటు 700 కొత్త ఎల్ఈడి బల్బులు, 140 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలు ఓటు వేస్తున్నప్పుడు ప్రలోభాలకు లొంగకుండా నియోజకవర్గ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి దిశగా పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు విమర్శలపై కాకుండా అభివృద్ధిపై పోటీ పడితే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
16వ వార్డు ఇన్‌చార్జ్ నాగేంద్ర రాజు మాట్లాడుతూ, గత 20 నెలల్లోనే వార్డులో 20కు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవ, చింతకాయల పద్మావతి పర్యవేక్షణతో శారదానగర్‌లో 90 శాతానికి పైగా రోడ్లు, డ్రెయిన్‌లు, విద్యుత్ స్తంభాల పనులు పూర్తయ్యాయని, తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆదిలక్ష్మి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, రుత్తల కృష్ణ, పలు వార్డుల ఇన్‌చార్జులు, నాయకులు, మహిళలు, మున్సిపాలిటీ అధికారులు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.