రూ.1,033 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి వేగవంతం – చింతకాయల పద్మావతి ప్రతి వార్డుకూ సమాన ప్రాధాన్యం... అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

నర్సీపట్నం: జులై 27( స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో 7, 8, 9, 26, 28 వార్డుల్లో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అదే సమయంలో స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా 26వ వార్డులో విఎంఆర్డీఏ, 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించారు. అనంతరం 28వ వార్డులో రూ.16.30 లక్షలతో చేపట్టనున్న రెండు సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 7, 8, 9 వార్డుల్లో 15వ ఆర్థిక సంఘం, డీఎంఎఫ్, విఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. 8వ వార్డులో రూ.13 లక్షలు, 7వ వార్డులో రూ.23 లక్షల శంకుస్థాపనలు, రూ.44.20 లక్షల ప్రారంభోత్సవాలు, 9వ వార్డులో రూ.1.63 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో నర్సీపట్నం పట్టణం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణానికి తగిన నిధులు రాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీకి రూ.32 కోట్ల అభివృద్ధి నిధులు, ఇంటింటికీ తాగునీటి సరఫరా పథకానికి రూ.185 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అలాగే పట్టణంలో 700 కొత్త ఎల్ఈడీ వీధి దీపాలు, 1,075 పాత లైట్ల మార్పిడి, 140 కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేపట్టినట్లు వెల్లడించారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం రూ.1,033 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, అయ్యన్నపాత్రుడు ప్రత్యేక కృషితో మున్సిపాలిటీకి గ్రేడ్-1 హోదా సాధించడంతో భవిష్యత్తులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యం ఇస్తూ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాస్, 28వ వార్డు ఇంచార్జ్ డబ్బీరు శ్రీకాంత్, మాజీ ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.