మాకవరపాలెం: జులై 27( స్పీడ్ న్యూస్ )
మాకవరపాలెం మండలంలోని తామరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విశాఖ ఉమ్మడి జిల్లా జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రుత్తల సన్యాసి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులకు న్యాయ అవగాహనపై విలువైన సూచనలు చేశారు.
సదస్సులో లోక్ అదాలత్ ద్వారా వివాదాలను సామరస్యపూర్వకంగా, తక్కువ సమయంలో పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే పౌరుల హక్కులు, బాధ్యతలు, న్యాయపరమైన విధానాలపై అవగాహన కల్పిస్తూ చట్టాలపై సరైన అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొన్నారు.
మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలు, పోక్సో (POCSO) చట్టం, ఈవ్ టీజింగ్ నివారణ, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించారు. సెల్‌ఫోన్, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని, అపరిచితుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు, ఫోన్ కాల్స్‌ను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, చట్టాలను గౌరవిస్తూ నైతిక విలువలతో మంచి పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని రుత్తల సన్యాసి నాయుడు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ), పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు శాఖ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ అవగాహన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.