నర్సీపట్నంలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపు

నర్సీపట్నం: జులై 27(స్పీడ్ న్యూస్) ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు నర్సీపట్నం నియోజకవర్గంలో సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని నాయకులకు సూచించారు.
నర్సీపట్నం మున్సిపాలిటీతో పాటు పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, జన సమీకరణ, రవాణా ఏర్పాట్లు, గ్రామాల వారీగా బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా మండల, గ్రామ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను పార్టీ నాయకులు ఏటికొప్పాక వెంకటేశ్వర స్వామి వారి ప్రతీకతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, జడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, మున్సిపాలిటీ వార్డు ఇన్‌చార్జులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.