ప్రజా సమస్యలపై పోరాడిన వారిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నర్సీపట్నం: జులై26( స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం రూరల్ మండలం దుగ్గాడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు శానాపతి వెంకటరత్నం (చిన్నబాబు) ఆధ్వర్యంలో నిర్వహించిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణం, ప్రజల సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ, రానున్న రాజకీయ పరిణామాలపై నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ సిద్ధాంతాలను గ్రామాల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాట్లాడిన పెట్ల ఉమాశంకర్ గణేష్, పిస్తుత టీడీపీ హయాంలో రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా అనేక తప్పుడు కేసులు నమోదు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.
రెండేళ్లలో తనపై కూడా ఎన్నో తప్పుడు కేసులు నమోదు చేశారని, ఎలాంటి తప్పు చేయకపోయినా ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారి ఆదేశాలతోనే పోలీసులు వ్యవహరించారని, ప్రజల తరఫున పోరాడిన వారిని భయపెట్టేందుకు కేసులను ఆయుధంగా ఉపయోగించారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను అణచివేయడం సరికాదని, చట్టాన్ని రాజకీయ కక్షసాధింపుకు వినియోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఉమాశంకర్ గణేష్ అన్నారు.
ప్రభుత్వ హయాంలో నమోదైన రాజకీయ ప్రేరేపిత కేసులపై సమగ్ర విచారణ జరిపి, నిర్దోషులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.