విజయవాడ: జులై26( స్పీడ్ న్యూస్) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కలిసి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఇరు రాష్ట్రాల స్పీకర్లకు దేవాదాయ శాఖ అధికారులు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం వారు అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
దర్శనం అనంతరం రంగమండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, పవిత్ర చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ కూడా ఆలయానికి చేరుకుని శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు ఒకే వేదికపై కలిసి అమ్మవారిని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది.