ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం: చింతకాయల పద్మావతి

నర్సీపట్నం, జూలై 26: (స్పీడ్ న్యూస్)
ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నర్సీపట్నంలోని ప్రసిద్ధ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో కళకళలాడింది. ఈ సందర్భంగా ద్వారపూడి రాంబాబు దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అమ్మవారికి 32.8 గ్రాముల స్వర్ణ కాసులపేరును భక్తిపూర్వకంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి చేతుల మీదుగా ఈ స్వర్ణాభరణాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి స్వర్ణ కాసులపేరుతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. దాతల కుటుంబ సభ్యులు, చింతకాయల పద్మావతి, ఆలయ కమిటీ ప్రతినిధులు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ద్వారపూడి రాంబాబు దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 32.8 గ్రాముల బంగారు కాసులపేరును సమర్పించడం గొప్ప సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ స్వర్ణాభరణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆలయ ఈవోకు అధికారికంగా అందజేస్తామని ఆమె తెలిపారు. దాతల కుటుంబ సభ్యులపై అమ్మవారి దివ్య కృప ఎల్లప్పుడూ ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తుల సహకారంతో ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం దాతల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ తాతయ్య, నానమ్మల పవిత్ర స్మృతికి గుర్తుగా ఈ స్వర్ణ కాసులపేరును తయారు చేయించి, చింతకాయల పద్మావతి చేతుల మీదుగా శ్రీ నూకాంబిక అమ్మవారికి సమర్పించడం తమ జీవితంలో ఒక మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచిందని తెలిపారు. అమ్మవారి అనుగ్రహం తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, దాతల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ ఆదివారం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొనగా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు.