చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అయ్యన్న చిత్రపటాలకు పాలాభిషేకం నర్సీపట్నం దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చారిత్రాత్మక అడుగు ప్రజల కలను సాకారం చేసిన ఘనత స్పీకర్ అయ్యన్నపాత్రుడిదేనని నాయకుల ప్రశంసలు

నర్సీపట్నం, జూలై 25: (స్పీడ్ న్యూస్)
నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నాటి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.500 కోట్ల భారీ నిధులను సాధించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాకవరపాలెం మండలం మాకవరపాలెం, నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విజయోత్సవ వాతావరణంలో భారీ ర్యాలీలు చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరంతరం కృషి చేశారని కొనియాడారు. నియోజకవర్గ చరిత్రలోనే ఒకే ఒక్క తాగునీటి ప్రాజెక్టుకు రూ.500 కోట్ల నిధులు మంజూరు కావడం చారిత్రాత్మక ఘట్టమని, ఇది స్పీకర్ దూరదృష్టి, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నిజం చేయడంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక పాత్ర పోషించారని నాయకులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నర్సీపట్నం నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి వేలాది కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ శ్రేణులు హర్షధ్వానాలు చేశారు. కార్యక్రమాల్లో మండల టీడీపీ అధ్యక్షులు ఆర్.వై. పాత్రుడు, సుకల అప్పలనాయుడు, నాయకులు అల్లు నాయుడు, చిరంజీవి రాజు, కిషోర్, బోలం రాంప్రసాద్, బౌలింగ్ వెంకీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై తాగునీటి ప్రాజెక్టు నిధుల సాధనను ప్రజల విజయంగా అభివర్ణిస్తూ సంబరాలు నిర్వహించారు.