మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు KGBVలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశం

కోటవురట్ల జులై 25(స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా, కోటవురట్ల: కోటవురట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అస్వస్థతకు గురైన విద్యార్థినులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా KGBV ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి విద్యార్థినికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.
ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితిని హోం మంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమీక్షిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తల్లిదండ్రులకు సరైన సమాచారం అందించాలని కూడా అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, ఆరోగ్య భద్రత చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.