న్యూఢిల్లీ:జులై 15(స్పీడ్ న్యూస్)
రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన మరియు నామినేట్ అయిన సభ్యుల కోసం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పారిశ్రామిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు చింతకాయల విజయ్ పాల్గొన్నారు. నూతన సభ్యులకు పార్లమెంటరీ విధివిధానాలు, చట్ట నిర్మాణ ప్రక్రియ, సభా సంప్రదాయాలు, కమిటీల పనితీరు, డిజిటల్ పార్లమెంటరీ వ్యవస్థపై సమగ్ర అవగాహన కల్పించేందుకు రాజ్యసభ సచివాలయం ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌తో పాటు పలువురు సీనియర్ పార్లమెంట్ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభలో ప్రస్తావించడం, చట్టాల రూపకల్పనలో సభ్యుల పాత్ర, కమిటీల ద్వారా జరిగే పరిశీలన, ప్రజాప్రయోజన అంశాలపై చర్చించే విధానాల గురించి నూతన సభ్యులకు విపులంగా వివరించారు.
ఈ సందర్భంగా రాజ్యసభను పూర్తిస్థాయి డిజిటల్ సంసద్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సభ్యులకు పరిచయం చేశారు. భాషా అవరోధాలను అధిగమిస్తూ సభ్యులు వివిధ భారతీయ భాషల్లో జరిగే చర్చలను సులభంగా అర్థం చేసుకునేందుకు రూపొందించిన ‘వాణి సేతు’, సభా కార్యక్రమాలు, ప్రశ్నలు, నోటీసులు, బిల్లులు, కమిటీ సమాచారం తదితర అంశాలను సభ్యుల మొబైల్‌లోనే అందుబాటులోకి తీసుకువచ్చే ‘సదస్య సేతు’ వంటి డిజిటల్ సేవల వినియోగాన్ని ప్రదర్శించారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, నూతన సభ్యులు పార్టీ రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అధ్యయనాత్మక దృక్పథంతో సభా చర్చల్లో పాల్గొనాలని, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ పార్లమెంట్ సమయాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా మార్చాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ, నూతన సభ్యులు చట్టసభల నియమాలు, సంప్రదాయాలు, సభా నిర్వహణ విధానాలను సులభంగా అర్థం చేసుకునేందుకు ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సభ్యులందరికీ రాజ్యసభ సచివాలయం తరఫున అన్ని రకాల పరిపాలనా, సాంకేతిక సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ చింతకాయల విజయ్ రాజ్యసభ కార్యకలాపాలు, డిజిటల్ పార్లమెంటరీ వ్యవస్థ, చట్ట నిర్మాణ ప్రక్రియ, పార్లమెంటరీ కమిటీల పనితీరుపై సమగ్ర అవగాహన పొందారు. ప్రజా సమస్యలను మరింత సమర్థవంతంగా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.